- ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల పెట్టుబడులకు ఏపీ అనుకూలం
- ఎల్‌ఎన్‌జి టెర్మినళ్ల అభివృద్ధి, విస్తరణకు సహకరించండి
- గ్యాస్ పైప్‌లైన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ విస్తరించాలి
- కేంద్ర పెట్రోలియం మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఢిల్లీ (చైతన్య రథం): ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని.. ఏపీలో పెట్టుబడులకు ఇదే అనుకూల సమయమని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎల్‌ఎన్‌జీ టెర్మినళ్ల అభివృద్ధి, విస్తరణకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఢల్లీి పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు హాజరుకావాలని ఈ సందర్భంగా మంత్రిని చంద్రబాబు ఆహ్వానించారు. రూ. 96,862 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించడంతోపాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించినట్టు వెల్లడిరచారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ విజయవంతంగా పూర్తయ్యిందని, పర్యావరణ అనుమతులు కూడా త్వరలోనే రానున్నాయన్నారు. ప్రాజెక్ట్ అన్ని దశల్లో వేగంగా ముందుకు సాగుతోందని వివరిస్తూ.. ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగావకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్ర ఆర్థికవృద్ధికి గణనీయమైన తోడ్పాటు లభించనుందని సీఎం చంద్రబాబు వివరించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రికి అనేక అంశాలపై విజ్ఞాపనలు చేస్తూ.. ‘‘సహజ వాయువు, ఎల్‌ఎన్‌జి రంగంలోని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరించండి. రాష్ట్రంలోని ఎల్‌ఎన్‌జి టెర్మినళ్లను మరింతగా అభివృద్ధి చేయాలి. ఐవోసీఎల్, గెయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసఎల్ పెట్రో నెట్ ఎల్‌ఎన్‌జివంటి చమురు కంపెనీలు ఏపీ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చూడండి’’ అని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను విస్తరించాలని కోరుతూ.. దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030నాటికి 6 శాతం నుంచి 15శాతానికి పెంచాలన్న ప్రధాని మోదీ విజన్‌కు ఏపీ తనవంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 65.4 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ.. పీఎంయూవై పథకం పరిధిలోకి వస్తే పథకం లబ్దిదారులకు సిలిండరుపై రూ.300 రాయితీ అందుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.













