- మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ
- ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ
మచిలీపట్నం (చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ఆయన వారి సమస్యల పరిష్కారానికి భరోసా కల్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రెవెన్యూ, పింఛన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎక్కువగా అర్జీలు వచ్చినట్లు మంత్రి తెలుపుతూ, వచ్చిన అర్జీలను వెంటనే ఆన్‌లైన్ చేసి వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల కాలనీల్లో సరైన మౌలిక వసతులు లేక లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని, అలాంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని, అందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు, పశ్చిమగోదావరి నుంచి ప్రకాశం వరకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి రాయలసీమ జిల్లా లతో మూడు ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో మచిలీపట్నంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మైరా, పోస్ట్‌కార్డు అనే సంస్థలు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసేందుకు ముందుకొస్తున్నాయని, అదేవిధంగా నౌకల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి గోవా, ఢల్లీి, ఇతర దేశాల నుంచి నాలుగు సంస్థలు రానున్నాయని వివరిస్తూ, త్వరలో వారికి అవసరమైన భూములను కేటాయించి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించునున్నదన్నారు.
ఏకకాలంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, కూటమి నాయకులు బచ్చుల అనీల్, మధుసూదనరావు, సోమశేఖర్, ఇలియాస్ బాషా, సుబ్రహ్మణ్యం, తదితర నాయకులు పాల్గొన్నారు.















