శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్‌ఏ `చైతన్య రథం): జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘‘అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ ఆర్ అండ్ డి/ ఇంజనీరింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి. విశాఖపట్నంలో ఒక జీసీసీ (జీసీసీ) ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి. విద్యారంగం రిమోట్ లెర్నింగ్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉన్న నిపుణులైన ఉపాధ్యాయులను వేలాది గ్రామీణ ప్రాంత విద్యార్థులతో కలిపి, నాణ్యమైన విద్యను అందించేందుకు వర్చువల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటుకు సహకారం అందించండి. రాష్ట్రంలో టెలీ మెడిసిన్, ప్రజారోగ్యాన్ని విస్తరించేందుకు జూమ్ వేదిక ద్వారా సాంకేతిక సహకారాన్ని అందించండి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ క్లినిక్స్‌లోని రోగులు జిల్లా ఆసుపత్రుల నిపుణ వైద్యులతో వీడియో కన్సల్టేషన్ ద్వారా సంప్రదించేందుకు వీలుగా టెలీ మెడిసిన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు సహకారం అందించండి’’ అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగం మాట్లాడుతూ… ‘‘మా సంస్థ బెంగుళూరు, చెన్నైలోని టెక్నాలజీ సెంటర్లతో భారత్ గ్లోబల్ ఆర్ అండ్ డి, ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌లో కీలకపాత్ర పోషిస్తూ ఇన్నోవేషన్, సపోర్ట్ హబ్‌గా ఉంది. భారత ఐటి రంగం, హెల్త్ కేర్ సంస్థలు, విద్యాసంస్థలు జూమ్ ప్లాట్ ఫాంను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తాం’’ అని హామీ ఇచ్చారు.














