- వైసీపీ డ్రామా పార్టీ, అరాచకాల పార్టీ
- అప్పుడు కోడికత్తి డ్రామా.. ఇప్పుడు గులకరాయి నాటకం
- 161 సీట్లలో ఎన్డీఏ గెలుపు పక్కా
అమరావతి (చైతన్యరథం): ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు సేవ చేయడం తప్ప ఏనాడు రాజకీయాల్లో జ్యోక్యం చేసుకోని నారా భువనేశ్వరి.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తో బయటకు రావాల్సి వచ్చిందని, ఆమె చేపట్టిన నిజం గెలవాలి యాత్ర దిగ్విజయంగా పూర్తయిందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…..చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసిన 2023, సెప్టెంబర్ 9 వ తేదీ రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు అన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబుని అక్రమ కేసులతో అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. ఓ వైపు చంద్రబాబు అరెస్ట్, మరో వైపు లోకేష్ పాదయాత్రలో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు అంతా అయోమయంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నారా భువనేశ్వరి బయటకు రావాల్సి వచ్చిందని అనురాధ చెప్పారు.
చంద్రబాబు ఆదేశాల మేరకే…
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు భువనేశ్వరి 27 రకాల సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారు. అయినా ఆమె ఏనాడు రాజకీయాల్లో జ్యోక్యం చేసుకోలేదు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్నపుడు 53 రోజుల పాటు బస్సులోనే ఉండి కార్యకర్తలకు భరోసా కల్పించారు. తన అరెస్టుతో కలతచెంది గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ధైర్యం చెప్పమని చంద్రబాబు నాయుడు చెప్పటంతోనే కార్యకర్తల కుటుంబాలకు భరోసా నిచ్చేందుకు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు శ్రీకారం చుట్టారని అనురాధ తెలిపారు.
కష్టాలు తెలుసుకుని, ధైర్యం చెబుతూ..
వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో గతేడాది అక్టోబర్ 25న చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కృష్ణా జిల్లా తిరువూరులో ఈ నెల 13న దిగ్విజయంగా ముగిసింది. భువనేశ్వరి 95 నియోజకవర్గాలో పర్యటించి 203 కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. రవాణా సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాల్లో కార్యకర్తల కుటుంబాలను సైతం కలిశారు. ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. బాధిత కుటుంబాల పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి కష్టాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో బడుగు బలహీన వర్గాల వారు వచ్చి వైసీపీ పాలనలో గంజాయి మాఫియా చెలరేగి పోతోంది, మా పిల్లలు గంజాయికి బానిసలుగా మారారని భువనేశ్వరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నారు. కోస్తాలో ప్రజలు.. వైసీపీ పాలనలో తాము పడుతున్న బాధలు చెప్పారు. రాయలసీమ వెళ్లినప్పుడు.. నువ్వు మా రాయలసీమ కోడలివి నీకు అండగా మేముంటాం అంటూ భువనేశ్వరికి అక్కడ ప్రజలు మద్దతు పలికారు. భువనేశ్వరితో పాటు కార్యకర్తల కుటుంబాలను కలిసే అవకాశం నాకు కల్పించిన చంద్రబాబు, లోకేష్‌కి కృతజ్ఞతలు. నిజం గెలవాలి యాత్రలో రాష్ట్రమంతా తిరిగా కాబట్టి చెబుతున్నా.. 161 సీట్లలో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని అనురాధ ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ డ్రామాలో భాగమే
వైసీపీ డ్రామా పార్టీ, అరాచకాల పార్టీ, విధ్వంసాల పార్టీ, బడుగు బలహీన వర్గాలను పీక్కుతింటున్న పార్టీ. కోడికత్తి డ్రామా అయిపోయింది.. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో కరెంటు ఎందుకు లేదు? అంతమంది సెక్యురిటీి ఉండి.. దాడి జరుగుతుంటే ఎందుకు ఆపలేదు? ఇదంతా వైసీపీ డ్రామాలో భాగమే, వైసీపీ డ్రామాలను ప్రజలు నమ్మబోరని పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు.