- ఓటమిని పదేపదే అంగీకరిస్తున్న జగన్
- దెందులూరు సభలోనూ రిపీట్ రిపీట్
- వైఫల్యాలను దాచిపెట్టి అబద్ధపు ప్రసంగం
- విపక్షాలపై విషం చిమ్మే కుటిలయత్నం
- సర్వవ్యవస్థలను స్తంభింపచేసిన సిద్ధం సభ
- భారీగా ప్రజాధనం దుర్వినియోగం
జగన్ ఓడిపోయాడు..తనకు తానుగా `ఓటమిని ముందే ఒప్పుకున్నాడు. అదే విషయాన్ని పదే పదే `‘సిద్ధం’ సభలతో చెప్పుకుంటున్నాడు. ఎప్పటికీ గెలిచే అవకాశమే లేదని చెప్పుకుంటూనే ఉన్నాడు. చారిత్రక ఓటమి ఎంత ఘనంగా ఉంటుందో రుచి చూపించడానికి రాష్ట్ర ప్రజానీకాన్ని మానసికంగా ‘సన్నద్ధం’ చేస్తున్నాడు. ఎన్నికల రణక్షేత్రంలోకి దిగకముందే ఓటమిని ఖరారు చేసుకున్న భీరులకు ఎలాగూ యుద్ధంతో పనుండదు. కాని `దిగి పోతూ పోతూ.. ప్రత్యర్థులపై బుదరచల్లాలన్న పైశాచిక వికృతానందం బీరుల మదిలో విలయతాండవం చేస్తుంది. ఇప్పుడు జగన్‌లో అదే కనిపిస్తోంది. తనపై పట్టు సాధించిన ప్రత్యర్థులపై విషం వెదజల్లడానికి ‘సిద్ధ’మయ్యాడు. కల్పితాలు కలబోసి.. కుట్రలు జతచేసి.. అభాండాలు అతికించి.. అతి తెలివి జోడిరచి.. – గెలుపు యజ్ఞాన్ని భగ్నం చేసే మారీచ పాత్ర పోషిస్తున్నాడు.
పెత్తందారుకు అదే పైశాచిక `గెలుపు. మన’స్సాక్షి అంగీకరించకున్నా.. ఆత్మ’సాక్షిని సంతృప్తిపర్చుకోడానికి అర్జునుడితో పోల్చుకుంటూ.. ప్రజలను మాయ చేయడానికి కృష్ణ సారధ్యాన్ని ఆపాదిస్తూ.. ఎన్నికల పులిహోర కలపటం చూస్తుంటే `ముఖ్యమంత్రి గద్దె కూడా సిగ్గుపడి గెంటేసే పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధం సభల్లో `ఆత్మస్తుతి, పరనిందకు తప్ప.. పనికొచ్చే విషయం ఒక్కటీ లేదన్నది ఏలూరు జిల్లా దెందులూరు సభతో మరోసారి రుజువైంది.
జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన దెందులూరు గడ్డమీద `శుక్రవారం సాయంత్రం వైసీపీ పరివారం ఘన గేదరింపు మధ్య `సిద్ధం సభ శుద్ధదండగలా సాగింది. అటు రవాణా వ్యవస్థ, ఇటు విద్యా వ్యవస్థను, మరోపక్క ప్రజా జీవనాన్ని స్థంభింప చేసి.. భూనబోళాంతరాలు బద్దలవుతున్నట్టు వికటాట్టహాసంగా కొలువుదీర్చిన సిద్ధం వేదికమీద – జగన్ రొడ్డకొట్టుడు ఉపన్యాసంతో సరిపెట్టడం.. ఓటమిని మళ్లీ మళ్లీ ఒప్పుకోవడమే.
57 నెలల్లో మీ బిడ్డ 124సార్లు బటన్ నొక్కాడు. మీకు మరింత డబ్బు కావాలంటే `నా కోసం ఒక్క బటన్ రెండుసార్లు నొక్కండి. ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికల కోసం.. రెండోది పార్లమెంట్ ఎన్నికల కోసం. లేకుంటే.. మీరు పొందుతున్న లబ్ది మాయమవుతుంది. పథకాలు రద్దవుతాయి’ `అంటూ బ్లాక్‌మెయిలింగ్ ఉపన్యాసానికి ఉపక్రమించడం.. జగన్‌ను ఓటమి భయం ఎంత భయానకంగా వెంటాడుతుందో దెందులూరు సభతో అర్థమైంది. గత ఎన్నికలకు ముందు ‘ఒక్క ఛాన్స్’ అంటూ జనాన్ని మోసం చేసిన జగన్ `వచ్చే ఎన్నికలకు ‘ఒక్క బటన్’ ఉచ్చులో ఇరికించే బ్లాక్‌మెయిల్ కుట్ర ప్రస్ఫుటమైంది.
సిద్ధమా.. సిద్ధమా.. సిద్ధమా..? అంటూ గొంతు చించుకోవడంతో మొదలైంది జగన్ ప్రసంగం. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా? `అంటూ బలవంతంగా తోడ్కొని వచ్చిన జనాన్ని జగన్ ప్రశ్నించారు. ఆ చారిత్రక విజయం తెలుగుదేశం, జనసేన కూటమిదన్న భావన జగన్ ప్రశ్నలో స్ఫురించింది. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా? అన్నపుడూ.. విధ్వంసానికి గురిచేసిన వైసీపీ కాదు, పున:ర్నిర్మాణానికి నడుంకట్టిన తెలుగుదేశం గుర్తుకొచ్చింది. రామాయణ, మహాభారతాల్లోని ప్రతి పాత్రలను విపక్షాలకు అంటగట్టడంలో `జగన్‌లోని పైశాచిక ఆనందమే ప్రజలకు వినిపించింది. విపక్షాలను తోడేళ్లతో పోల్చి ఆత్మానందాన్ని పొందిన జగన్ `వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరికానని, జనమే తనవెంట ఉన్నారని భ్రమలను వాస్తవాలుగా చూపించే ప్రయత్నమే చేశారు. `‘నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే. వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని’ అంటూ మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు. వైసీపీ మ్యానిఫెస్టోని మరోసారి పవిత్ర గ్రంథంతో పోల్చిన జగన్ `నెరవేర్చని హామీలను నెరవేర్చినట్టు నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. రాష్ట్ర అభివృద్ధి మీద, పేదవాడి సంక్షేమంమీద, విద్యా విధానంమీదా.. గ్రామాల పురోభివృద్ధిమీదా శత్రుమూకలు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్న పెత్తందారు ప్రకటనలు తప్ప.. విధ్వంసానికి గురైన రాష్ట్ర పరిస్థితిని నిజాయితీగా ఒప్పుకోలేక పోవడం `జగన్‌లోని రాజకీయ పరిణితిలేమికి అద్దంపట్టింది. తన పాలనా వైఫల్యాలను విపక్షాలకు అంటగడుతూ.. తనను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టకపోతే పథకాలతో వచ్చే పైకం దక్కకుండా పోతుందన్న బెదిరింపు కనిపించింది.
గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం దేనికీ నోచుకోనట్టు చిత్రీకరిస్తూనే.. తన పాలనతో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ అగ్రగామి స్థానానికి చేరుకున్నట్టు చెప్పుకున్న గొప్పలు.. వైసీపీ డొల్లతనాన్ని తేటతెల్లం చేశాయి. చెప్పిందే చెప్తూ.. చెయ్యనిదీ చెప్తూ.. అబద్ధాలను రుద్దుతూ.. విపక్షాలపై విషం కుమ్మరించడానికి జగన్ చేసిన ప్రయత్నం దెందులూరు సభలో మరోసారి విఫలమైంది.
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ఉప్పు పాతరేసిన విషయాన్ని మరుగున పెట్టి `కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇంటింటికీ మందులిస్తున్నాం అంటూ జగన్ సోది ప్రసంగాన్నే సాగించారు. రాష్ట్రంలో `కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని చెప్తూనే.. మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నామని నిస్సిగ్గుగా చెప్పుకోవడం జగన్‌కే సాధ్యమైంది. ఐదేళ్ల పాలనలో చెప్పిన లక్షలాది అబద్దాలకు ముసుగేసి `అబద్దాల పునాదులపై ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయని చెప్పడం.. దిగజారుడు రాజకీయమే.
ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ జగనే. 3వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్‌లో అది మరింత పెరగాలన్నా.. మీ జగనే రావాలి. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ చెప్పాలి. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి. పేదల సొంతింటి కల నెరవేరాలంటే, రైతు భరోసా కొనసాగాలంటే’ అంటూ బేలతనంతో సాగిన ఊకదంపుడు ఉపన్యాసం తప్ప.. సిద్ధం సభలో జగన్ కొత్తగా చెప్పిందేమీ లేదు. చేసిందేమీ లేకపోయినా `మేనిఫెస్టోలో ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వల్లె వేయడం తప్ప.. నిర్మాణాత్మక అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రణాళిక, ఉద్యోగ ఉపాధి కల్పన, సంపద సృష్టికి వైసీపీ ఎలాంటి విధానాన్ని అనుసరించబోతోందన్న అంశం జగన్ ప్రసంగంలో ఒక్కటీ లేకపోవడం `సిద్ధం విఫల సభకు కొసమెరుపు.
శనివారంనాటి ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ని తరలించడానికి వైసీపీ శ్రేణులు ఎంత కష్టపడ్డాయో.. జగన్ రిపీటెడ్ ప్రసంగాన్ని భరించడానికి క్యాడర్ అంతే కష్టపడినట్టు కనిపించింది. నస భరించలేని జనం బారికేడ్లు దాటుకుని పారిపోయిన దృశ్యాలూ `కెమెరాల కన్ను దాటిపోలేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి.. వ్యవస్థలను స్థంభింపచేసి.. జనాన్ని బలవంతంగా తరలించి.. వైసీపీ చేసిన బలప్రదర్శన.. జగన్ ఓటమి ఎంత ఘనంగా ఉండబోతుందో రుచి చూపించడానికే అన్నట్టుంది.