- కొత్తగా పోలవరం, మార్కాపురం
- మారిన అన్నమయ్య జిల్లా స్వరూపం
- జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మార్పు
- కడప జిల్లాలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వేకోడూరు
- ప్రకాశంలోకి అద్దంకి, నెల్లూరు జిల్లాకు గూడూరు
- కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు
- మార్పులన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి
- గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు
- సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలపై రూ.41 కోట్ల మేర వడ్డీ మాఫీ
- ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
- మీడియాకు వెల్లడిరచిన మంత్రులు అనగాని, సత్యకుమార్, నాదెండ్ల
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అన్నమయ్య జిల్లా స్వరూపం మారనుంది. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. దీనికి సంబంధించి ఈ నెల 31న తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. రాయచోటి ఈ జిల్లాలోనే కొనసాగుతుంది. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాకు, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
క్యాబినెట్‌లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌తో కలిసి మీడియాకు వెల్లడిరచారు. గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో జారీ చేసిన జీవోలు ప్రజలకు ఓపెన్ డొమైన్‌లో అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించామన్నారు. రూ.41 కోట్ల మేర రుణాలపై వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే స్మార్ట్ మీటర్లను ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం సరైన కసరత్తు లేకుండా జిల్లాల విభజన చేసిందని, గతంలో పారదర్శకంగా చేసుంటే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రులు నాదెండ్ల, సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
వారి ఫొటోలు ఉండవు: సత్యప్రసాద్
గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రెండు నగరాలను గ్రేటర్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. రాజముద్రతో 21.8 లక్షల పాస్ బుక్‌లు పంపిణీ చేస్తున్నాం. జవనరి 9లోగా వీటి పంపిణీ పూర్తి చేస్తాం. తప్పులు సరిచేశాకే పాస్ బుక్‌లు ఇవ్వాలని ఆదేశించాం. పాస్ బుక్ పై గత పాలకుల ఫొటోలు తొలగించాం. జిల్లాల పునర్వవస్థీకరణపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని.. 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడిరచారు. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలవరం జిల్లాను రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులు చేసినట్లు తెలిపారు. రంపచోడవరం ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధి కుంటుపడకుండా ఉండేందుకు, ఒకే పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాలు ఉన్నా కూడా ఈ జిల్లా ఏర్పాటు చేశామని వివరించారు. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం హామీ ఇచ్చారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా తప్పించటంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలిచి సీఎం చంద్రబాబు ఓదార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సామర్లకోట మండలాన్ని పెద్దాపురం నియోజకవర్గానికి మార్చినట్లు తెలిపారు. అలాగే పెనుగొండ గ్రామానికి వాసవీ పెనుగొండగా పేరు మార్చినట్లు వెల్లడిరచారు. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మార్చినట్లు వివరించారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి సబ్ డివిజన్‌లోనే దర్శి నియోజకవర్గం ఉంటుందన్నారు. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి చేర్చామని తెలిపారు. రాజంపేటను ఎప్పటి నుంచో జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రజల అభిప్రాయం మేరకు కడప జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
మదనపల్లిని జిల్లాగా చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుంది.. జిల్లా కేంద్రంగా మాత్రం మదనపల్లె ఉంటుంది. రాయచోటి నుంచి మదనపల్లికి హెడ్ క్వార్టర్స్ మార్చామని వివరించారు. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మడకశిర, బనగానపల్లె, అడ్డరోడ్డు పేరిట కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఆదోనిలో పరిపాలనా సౌలభ్యం కోసం మండలాల సంఖ్యను పెంచి ఆదోని`1, ఆదోని`2గా విభజించినట్లు ప్రకటించారు. ఈ జిల్లాల, మండలాల మార్పులన్నీ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు: సత్యకుమార్
ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నాం. గతంలో జరిగిన విధ్వంసకర చర్యలను సరి చేస్తున్నాం. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టాం.. మౌలిక వసతుల కోసం దాదాపు రూ.3 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నాం. కొప్పర్తి, ఓర్వకల్లుకు పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ప్యూచర్ సిటీ వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోంది. గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు తమ పేర్లను కాకుండా.. మహనీయుల పేర్లను పెడుతున్నాం. దీనిపైనా మంత్రివర్గంలో చర్చ జరిగిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
రహదారుల కోసం భారీగా నిధులు: నాదెండ్ల మనోహర్
ఈ ఏడాదిలో ప్రభుత్వపరంగా చాలా కార్యక్రమాలను అమలు చేశాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి దిగ్విజయంగా చేసిన పనులు గురించి చర్చించాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు రూ.50 వేల కోట్ల వరకూ ఎన్టీఆర్ భరోసా పేరిట పింఛన్లు అందించాం. సచివాలయాల విషయంలోనూ చాలా మార్పులు చేశాం. ఇప్పటి వరకు రూ.1200 కోట్లు వెచ్చించి రోడ్లను వేశాం. రూ.2,500 కోట్లు మంజూరు చేసి రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం తీసుకొచ్చారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో విశాఖకు పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చాం. ఐటీ సేవలను మరింత విస్తతం చేసి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాం. పోలీసు శాఖను బలోపేతం చేశాం. గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారుస్తున్నామని మంత్రి మనోహర్ తెలిపారు. మంత్రిమండలి నిర్ణయాలు ఏలూరు జిల్లా నూజివీడు టౌన్, మండలంలో మొత్తం 9.96 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపీఎం) స్థాపన కోసం హార్టికల్చర్, సెరికల్చర్ విభాగ డైరెక్టర్‌కు 33 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామంలో 9.88 ఎకరాల భూమి లీజును వేదాంత లిమిటెడ్‌కు ఆన్‌షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం మూడు సంవత్సరాల కాలానికి పునరుద్ధరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది
తిరుపతి జిల్లా దామినేడు గ్రామంలో మొత్తం 28.37 ఎకరాల ప్రభుత్వ భూమిని ‘‘స్పోర్ట్స్ సిటీ’’ స్థాపన కోసం శాప్‌కు ఉచితంగా బదిలీ చేసేందు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అమరావతిలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు కోసం ఎన్‌ఐడీఏ (నాబార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్) స్కీమ్ కింద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) నుండి రూ.7,387.70 కోట్ల రుణం పొందేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు మంత్రి మండలి అనుమతి ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఫైనాన్స్‌తో అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ‘‘సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్-2 కమిషనింగ్ (కెపాసిటీ 8400 క్యూసెక్) 15 సంవత్సరాల ఆపరేషన్, మెయింటెనెన్స్‌తో లంప్‌సమ్ కాంట్రాక్ట్ (టెండర్) ప్రాతిపదికన ఎల్ 1 బిడ్‌ను ఆమోదించేందుకు ఏడీసీఎల్ చైర్‌పర్సన్ అండ్ ఎండీకి అధికారం ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ల లేఔట్‌లలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అనుబంధంగా జోన్-8 ఏరియాలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో, ప్రక్కనే ఉన్న జోన్‌లలోని పెనుమాక లేఔట్‌లో ‘‘రోడ్లు, డ్రైన్స్, వాటర్ సప్లై, సీవరేజ్, పవర్, ఐసీటీ కోసం యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్‌లైన్, ఎస్‌టీపీ, అవెన్యూ ప్లాంటేషన్’’ నిర్మాణానికి ఎల్ 1 బిడ్‌ను ఆమోదించేందుకు ఏడీసీఎల్ చైర్‌పర్సన్ అండ్ ఎండీకి అధికారం ఇస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా సెట్టిపల్లి లాండ్ పూలింగ్ స్కీమ్ కింద తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అమలు చేసిన అన్ని కన్వేయెన్స్ డీడ్స్‌కు సంబంధించి లబ్ధిదారులకు/కేటాయింపుదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెట్టిపల్లి గ్రామంలో దశాబ్దాలుగా టైటిల్ లేకుండా ప్రైవేట్ ఆక్రమణలో ఉన్న పెద్ద భూములను క్రమబద్ధీకరించేందుకు ఈ లాండ్ పూలింగ్ స్కీమ్ ప్రవేశపెట్టారు.
సీఆర్‌డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ లో వికేంద్రీకృత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి రూ.1673.51 కోట్లతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కే సురేష్ కుమార్‌ను అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఏసీఎఫ్)గా నియమించేందుకు, ఆ క్యాడర్‌లో సూపర్‌న్యూమెరరీ పోస్ట్‌ను సృష్టించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన 11,479 మంది లబ్ధిదారుల ప్రయోజనం కోసం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ నుంచి తీసుకున్న రుణాలపై రూ.41.61 కోట్ల మేర వడ్డీ మాఫీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి విద్యుత్ రంగంలో పనితీరుకు అనుసంధానించిన జీఎస్‌డీపీలో 0.50% వరకు అదనపు రుణాన్ని పొందేందుకు, ప్రిపెయిడ్ స్మార్ట్ మీటర్లను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా దొరవారి సత్రం, తడ మండలాల్లో కాళంగి నది ఎడమ ఒడ్డున ఉన్న ఫ్లడ్ బ్యాంక్ అభివృద్ధి పనుల్లో ప్యాకేజీ`1 కింద ఉన్న పనుల ప్రీ క్లోజర్‌కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2024 జనవరి 1వ తేదీ నుండి డీఏ/డీఆర్ 3.64% పెంపు అమలులోకి వచ్చే విధంగా ఆర్థికశాఖ 2025 అక్టోబర్‌లో జారీ జేసిన ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పునకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ-కోర్ట్స్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 13 జిల్లా కోర్టుల్లో 13 సిస్టమ్ ఆఫీసర్ పోస్టులు, 26 సిస్టమ్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు రాష్ట్ర మంచి మండలి ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా పేరూరు గ్రామంని ప్రభుత్వ భూమిలో హయత్ రీజెన్సీ పేరుతో ఐదు నక్షత్రాల లగ్జరీ హోటల్ నిర్మాణానికి 2024 ఫిబ్రవరి 14న కుదిరిన లీజ్ ఒప్పందాన్ని రద్దు చేసి, పెట్టుబడిదారు చెల్లించిన చట్టబద్ధ రుసుములను తిరిగి చెల్లించడానికి పర్యాటక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది తిరుపతి జిల్లా దుగరాజుపట్నంలో షిప్ బిల్డింగ్ డెవలప్‌మెంట్ స్కీం కింద గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సముద్ర మండలి (ఏపీఎంబీ)కి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా దామవరం గ్రామంలో 418.14 ఎకరాల భూమిని దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మంత్రి మండలి అనుమతి ఇచ్చింది. లైఫ్ టాక్స్ వర్తించే మోటార్ వాహనాలపై లైఫ్ టాక్స్‌లో 10% చొప్పున ‘‘రోడ్ సేఫ్టీ సెస్’’ ప్రవేశపెట్టడానికి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
బాపట్ల మండలంలోని వెస్ట్ బాపట్ల గ్రామంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కోసం ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరిట లీజ్ పద్ధతిలో కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, గుడివాడ గ్రామంలో 18.57 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్రీయ సేవా సమితికి బదిలీ చేయడానికి రాష్ట్ర రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి ఆమోదం తెలిపింది. ఈ భూమికి ఎకరాకు రూ.80 లక్షల చొప్పున, మొత్తం రూ.14,85,60,000 పరిహారం చెల్లించాలనే విశాఖ జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు భూ హక్కుల బదిలీకి అనుమతి. అమరావతి రాజధానిలో ‘‘అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)’’ నిర్మాణానికి రూపకల్పన, నిర్మాణ (డిజైన్` బిల్డ్) విధానంలో టెండర్ మంజూరు చేయడానికి రూ.137 కోట్లు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. అలాగే టెండర్ ప్రక్రియలో అతి తక్కువ బిడ్ సమర్పించిన ఎల్ 1 బిడ్డర్ అయిన లార్సన్ అండ్ టూబ్రో సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించేందుకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.















