- కలియుగ దైవం చిత్రపటాలతో రాజకీయాలా..?
- హిందూమత విశ్వాసాలను అవహేళన చేశారు
- భక్తకోటి మనోభావాలను దెబ్బతీశారు…
- సంప్రదాయాలపట్ల వైసీపీ విధానం ఇదేనా?
- మహాపచారాన్ని మండలి చైర్మన్ ఎలా అనుమతిస్తారు
- సంయమనం పాటించేకొద్దీ రెచ్చగొడుతున్నారు..
- జరిగినదంతా జగన్ డైరెక్షన్‌లోనేనని ప్రజలు గ్రహించారు
- వైసీపీ చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి
- మండలివద్ద కూటమి భాగస్వామ్య పక్షాల డిమాండ్
అమరావతి (చైతన్య రథం): ఏపీ శాసనమండలిలో వైకాపా సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలను ప్రదర్శించడాన్ని కూటమి సభ్యులు తీవ్రంగా ఖండించారు. చైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వైకాపా చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, రామానాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్ దష్టికి మంత్రులు తీసుకొచ్చారు. ఇలాంటి చర్యను చైర్మన్ ఎలా అంగీకరిస్తారని నిలదీశారు. వైకాపా చేసింది తప్పేనని మండలి చైర్మన్ మోషేన్ రాజు అంగీకరించారు. వైకాపా సభ్యులను పిలిచి మాట్లాడతానని చైర్మన్ స్పష్టం చేశారు. బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీశారు: పయ్యావుల
చట్టసభ సాక్షిగా వైకాపా సభ్యులు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని రెచ్చగొట్టేలా వైకాపా ప్రవర్తించిందని మండిపడ్డారు. హద్దులుదాటి ప్రవర్తించి దేవదేవుడు పట్ల మహాపచారానికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు ఎంతో కలచివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగటం తగదన్నారు. సంయమనం పాటించే కొద్దీ రెచ్చగొడుతున్నారని.. హిందువులపట్ల వైకాపా విధానం ఇదేనా? అని నిలదీశారు. వెంకటేశ్వరస్వామి పట్ల తమ పార్టీ విధానం ఇదేనని జగన్ చెప్తున్నారా..? అని ప్రశ్నించారు. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పేవరకు విషయాన్ని వదిలి పెట్టమని హెచ్చరించారు.
జగన్ డైరెక్షన్ లోనే: కందుల దుర్గేష్
జగన్ డైరెక్షన్‌లోనే వైకాపా ఎమ్మెల్సీలు స్వామివారిని తీవ్రంగా అవమానించారని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. జనసేన ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. వెంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని నిర్లక్ష్యంగా విసిరేయడం తేలిగ్గా తీసుకునే విషయం కాదని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలపై గౌరవంలేని వైసీపీ నాయకత్వం, దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని దుర్గేష్ విమర్శించారు. స్వామివారి చిత్రపటాలను సభలోకి తీసుకురావడమే కాకుండా, తిరిగి వెళ్లేటప్పుడు టేబుళ్లపైకి విసిరేయడం అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. మొత్తం వ్యవహారం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యవేక్షణలోనే జరిగిందని మంత్రి దుర్గేష్ ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు జగన్ మోహన్ రెడ్డి వెంటనే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ క్షమాపణలు చెప్పాలి: సోము వీర్రాజు
జాతి క్షమించరాని నేరానికి వైకాపా సభ్యులు, జగన్ పాల్పడ్డారని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు దుయ్యబట్టారు. సభ వాయిదా పడగానే వెంకటేశ్వరస్వామి చిత్రపటాలను ప్లకార్డులతోపాటు విసిరేసి వెళ్లారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతజాతికి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వరస్వామి అంటే ఇంత చులకన భావమేంటని సోము వీర్రాజు మండిపడ్డారు..
















