అమరావతి: రాష్ట్రానికి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిచౌంగ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకి విరామం ప్రకటించానని తెలిపారు. విపత్తుల సంస్థ జారీ చేసే హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత ప్రదేశాలలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని కోరారు. అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా మొబైల్ ఫోన్లలో ఛార్జింగ్ ఉంచుకోవాలని, శిథిల భవనాలలో అస్సలు ఉండొద్దని హెచ్చరించారు. టీడీపీ కేడర్ స్వచ్ఛందంగా తుఫాన్ సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
యువగళం పాదయాత్రకు.. మూడు రోజులు బ్రేక్!
మిచౌంగ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిరది. తుఫాన్ కారణంగా రెడ్ అలర్ట్ ఇచ్చినందున పాదయాత్రకు 3 రోజుల విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
తుఫాన్ ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారి పాకల నుంచి యువగళం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.