Tuesday, 28 April 2015 20:46

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ మేళా అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది 20,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇదివరకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు 20,250 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఆర్థికశాఖ ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని సిద్ధంచేసి ముఖ్యమంత్రి వద్దకు పంపింది. చంద్రబాబు ఆమోదముద్ర వేసిన వెంటనే ఏపీపీఎస్సీ, పోలీస్‌ శాఖలద్వారా వీటి భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేయడానికి ఏర్పాట్లుచేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 4,83,491 పోస్టుల్లో 77,737 ఖాళీగా ఉన్నట్లు ఆర్థికశాఖ ఇదివరకే తేల్చింది. ఇందులో ఎక్కువ భాగం డ్రైవర్లు, సబార్డినేట్‌ సిబ్బందివే ఉన్నాయి. కొన్నింటిని పదోన్నతుల ద్వారా భర్తీచేయనున్నారు. ఇవిపోగా మిగిలిన 20,250 పోస్టులను నేరుగా నియమించడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించి వాటి భర్తీకి సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీఎంకు ఆర్థికశాఖ పంపిన దస్త్రంలో అత్యధికంగా 9వేల ఖాళీలు హోంశాఖలోనే ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్‌-1 94, గ్రూప్‌-2 1100, గ్రూప్‌-3 1,500, వైద్య ఆరోగ్యశాఖలో 450, అన్నిశాఖల్లో ఇంజినీర్లు 1,600, ఇతరత్రా పోస్టులు 6,500 ఉన్నాయి.