Tuesday, 28 April 2015 20:42

ఎన్టీఆర్ తన పాలనాకాలంలో నిజాయితీగా పనిచేసే అధికారులకు స్వేచ్చనిచ్చారు... వారి ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువనిచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గా జయప్రకాష్ నారాయణ ఉండేవారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఆయన రెండేళ్లలో జిల్లాలోని లక్షన్నర ఎకరాలకి సాగునీటి సౌకర్యం కల్పించగలిగారు. వీరిద్దరి ఆలోచనల ఫలితంగా ప్రకాశం జిల్లాలో ఆనాడు చిన్నతరహా ఎత్తిపోతల పథకాల నిర్మాణం ఒక ఉద్యమంలా సాగింది.
నాడు జరిగిన ఓ సంఘటనను జెపీ ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ గుర్తుచేసుకున్నారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో భాగంగా చేపట్టిన తొలి ప్రాజెక్ట్ ను ప్రకాశం జిల్లాలోని ఉలిచి గ్రామంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నారు కలెక్టరు. ముఖ్యమంత్రి పర్యటన తేదీ కూడా ఖరారయ్యింది. అయితే ఉలిచి గ్రామం కాంగ్రెస్ కి పట్టున్న గ్రామమని, ఆ ఊరికి ముఖ్యమంత్రి వెళ్లి ప్రాజెక్ట్ ప్రారంభించడం మంచిది కాదని కొందరు స్థానిక నేతలు అభ్యంతరం చెప్పారంట. ఎటూ తేల్చుకోలేని అధికారులు విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్ళగా... “పని బాగా జరిగితే కాంగ్రెస్ గ్రామం అయితే ఏంటి, తెలుగుదేశం గ్రామం అయితే ఏంటి, అంతా మనవాళ్ళే కదా.. మన రాష్ట్రం వాళ్ళే కదా.. అయినా, మేము పార్టీ పెట్టకముందు అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా.. ఇప్పుడు కొందరు మేమంటే అభిమానంతో తెలుగుదేశం లోకి వచ్చారు. మనం మంచి పనులు చేసి అన్ని గ్రామాల ప్రజల్ని మనతో కలుపుకోవాలి గాని,కొన్ని గ్రామాలకి వెళ్ళము అని మనమే వెలేస్తే ఎలా..మేము ఆ గ్రామానికి వస్తాం, ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం” అని ఎన్టీఆర్ చెప్పారట. అన్నట్లు గానే ఆ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ విశాల దృక్పథానికి ఇదొక ఉదాహరణ