Tuesday, 28 April 2015 20:44

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖకు 2014-15 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ‘ఇంక్రిమెంటల్‌ డెవల్యూషన్‌ ఇండెక్స్‌ అవార్డు’ లభించింది. దీన్ని సాధించేందుకు కృషిచేసిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. పంచాయతీ, ఇతర నిధులను ఉపాధి హామీ పథకంతో జోడించి గ్రామాల్లో పనిచేసే ప్రతి కుటుంబానికీ అదనపు ఆదాయం కల్పించడం, మెరుగైన సిమెంటు రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించడం, మొక్కలు పెంచడం, నీటి సంరక్షణ విధానాలు పాటించడంతోపాటు సత్వర గ్రామీణాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ పురస్కారం లభించింది. 
ఆదివారం జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో జె ఆర్ డి టాటా కాంప్లెక్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని చేతులమీదుగా ఏపీ పంచాయత్ రాజ్ శాఖామంత్రి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దీంతోపాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని కూడా ఆయన అందుకున్నారు. 
అలాగే ఆదాయసృష్టి, ఆదాయవృద్ధి విభాగాల్లో విజయనగరం జిల్లా ప్రజాపరిషత్‌, గుంటూరు జిల్లా సత్తెనపల్లి, చిత్తూరు జిల్లా పూతలపట్టు, కుప్పం, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ప్రజాపరిషత్‌, విశాఖపట్నం జిల్లా ధర్మసాగరం పంచాయతీలకు అవార్డులు వచ్చాయి. ఇక సాధారణ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా వెలివెన్ను, ప్రకాశం జిల్లా పామూరు, కృష్ణా జిల్లా చోడవరం పంచాయతీలకు పురస్కారాలు లభించాయి.