Home :: About Us
 
PDF Print E-mail
NTR

ఎన్.టి.ఆర్. రాజకీయ ఇతివృత్తం గల చిత్రాలలో నటించారు. చలనచిత్రాలలో మొదటిసారి మానుకున్న కాలంలోని చివరి చిత్రాలన్నీ కుళ్ళు రాజకీయాలపైనా, వ్యవస్థపైనా తిరుగుబాటుచేసే పాత్రలు ధరించినవే. ఆయా చిత్ర సందర్భాలలో అంకురించి అతని మనస్సును తొందరపెడుతున్న భావాలను మొదటిసారిగా ఒక షూటింగ్ లో ఎన్.టి.ఆర్. బయటపెట్టారు. అలా ఔట్ డోర్ షూటింగ్ కోసం ఒకసారి హిమాలయ ప్రాంతంలోని మనాలికి వెళ్ళ్లారు. అక్కడ షూటింగ్ లోకేషన్ కు వెళ్ళ్లేసందర్భంలో బి.వి. మోహన్ రెడ్డి (తర్వాత మంత్రి) మొదలగు వారితో వేదంతధోరణిలో మాట్లాడారు. మనసులో ఏవేవో భావాలు ఆయన మాటల్లో బయటపడ్డాయి. "తెలుగు ప్రజలు" నన్ను ఇంతగా ఆదరించారు, అభిమానించి అందలం ఎక్కించారు. పేరు ప్రతిష్ట, కీర్తి, సిరిసంపదలు అన్నీ ఇచ్చారు. వారికి నేను ఏమి బదులిచ్చి రుణం తీర్చుకోగలను" అని మధనపడుతున్నట్లు మాట్లాడారు. ఆ సందర్భానికి అనుగుణంగానే బి.వి.మోహన్ రెడ్డి "అన్నగారూ! మీరు కనుక రాజకీయ రంగప్రవేశం చేస్తే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి" అని తన భవిష్యవాణిని వినిపించారు. రాజకీయాలలో ప్రవేశించాలన్న తన అంతరంగంలోని తొలి ప్రకంపనలను 1980 ప్రాంతాలలో "సర్దార్ పాపారాయుడు" చిత్రం కోసం ఊటీలో షూటింగ్ లో ఉండగా ఎన్.టి.ఆర్. వెల్లడించారు. అదే ఆయన పత్రికాముఖంగా వెల్లడించిన తొలి ప్రకటన. సినిమా పత్రికల విలేఖరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా"60" ఏళ్ళ్లు నిండిన తర్వాత తాను ప్రజాజీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నానని" తన మనసులోని మాట చెప్పారు. ఆనాటి రాజకీయ వ్యవస్థలోని అస్తవ్యస్త పరిస్థితులను తలచుకుని బాధ ప్రకటించారు. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. తర్వాత చంద్రబాబునాయుడు అల్లుడు కావాడం ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని అమితంగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్ లోని అస్థిరధోరణులకు విసిగి చాలా మంది ప్రాంతీయపార్టీల గురించి చర్చించసాగారు. అల్లుడు అయిన తర్వాత చంద్రబాబు కూడా ఆయనతో తరచుగా ఈ విషయంలో చర్చించేవారు.

అప్పటికే ఎన్.టి.ఆర్. రాజకీయాలలోకి రాబోతున్నారన్న వార్తలు కాంగ్రెస్ నాయకులను కలవరపరిచాయి. అల్లుడి పెండ్లి రిసెప్షన్ కు ఎన్.టి.ఆర్. బంజారాహిల్స్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య ఎన్.టి.ఆర్.కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఎరగా చూపే ప్రయత్నం చేశారు. ఎన్.టి.ఆర్. తిరస్కరించారు. కొడితే కుంభస్థలంలాంటి ముఖ్యమంత్రి అవకాశాన్నే కొట్టాలిగాని ఈ చిన్నా చితకా ఆయనకి నచ్చలేదు. హైదరాబాద్ లో అల్లుడి రిసెప్షన్ సందర్భంలోనే అల్లుడి హొదా, అధికారంలో, పదవిలో ఉన్నప్పటి మజా ఎలా ఉంటుందో ఎన్.టి.ఆర్. కుటుంబం రుచి చూసింది. ఇంతలో చిత్తూరుజిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో అంజయ్య, చంద్రబాబునాయుడును సస్పెండ్ చేసారు. అల్లుణ్ణి మళ్ళ్లీ మంత్రివర్గంలోకి చేర్పించడానికి ఎన్.టి.ఆర్. తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు తన మిత్రుడు అమితాబ్ ద్వారా అల్లుణ్ణి క్యాబినేట్ లో ప్రవేశపెట్టగలిగారు. అప్పుడు రామారావుకు రాష్ట్ర రాజకీయాలు ఏరకంగా నడుస్తాయో, ఎలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయో దీనితో అర్థమైంది. అప్పటి రాజకీయం అంటే నలుగురు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని, స్వార్థ ప్రయోజనాలకోసం వినోదప్రాయంగా నడిపే చదరంగమని ఆయనకు బోధపడింది. రాష్ట్ర రాజకీయాన్ని ప్రజారాజకీయాలవైపు మలుపుతిప్పే ఆలోచన ఆనాడే ఆయనలో మొలకెత్తింది.

రాజకీయ భావ స్పందనలు

భవనం వెంకట్రామ్ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్స్వానికి ఎన్.టి.ఆర్. రాజభవన్ కు వెళ్ళారు. ఆనాటి ఆవేడుకలు,ఆ రాజవైభవం అతని మనసులో బలమైన ముద్రవేశాయి. రాజకీయ ప్రవేశానికి మరింతపురికొల్పాయి. ఆ తర్వాత నెల తిరగకుండానే రాజకీయరంగ ప్రవేశంచేశారు. ఆయన రాజకీయాలలోకి ప్రవేశిందబోతున్నారుని వినగానే సినీరంగంలో ఆయనకు మరింత క్రేజ్ ఏర్పడింది. నిర్మాతలు చాలామంది ఆయన కాల్ షీట్స్ కోసం ఎగబడ్డారు. వారంతా ఆత్మీయులే! వారిని కాదనలేక ఒక ఉపాయం ఆలోచించి నలుగురు నిర్మాతలు కలిసి ఒకే చిత్రం ప్లాన్ చేసుకోవలసిందిగా సూచించారు. అలా నిర్మాణమైన చిత్రమే "నాదేశం" తాను షూటింగ్ లో ఉన్నా రాజకీయాలను గమనిస్తూ వచ్చారు. కాంగ్రెస్ రాజకీయాలు దిగజారిపోవటం, పరిపాలన పలచనైపోవటం వంటి పరిస్థితులు ఆయనని తొందరపెట్టాయి. ప్రజలనుండి ఒత్తిడీ, ఆహ్వానాలు పెరిగాయి.

"తెలుగుదేశం" అవతరణ

1982 మార్చి 21 తేదీన ఎన్.టి.ఆర్. జర్నలిస్ట్లులందరికీ పిలిచి రామకృష్ణ స్టూడియోలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తన గురించి తన కుటుంబం గురించి, తన ఆస్ఠిపాస్తుల గురించి, ప్రజలు చూపే ఆదరాభిమానాలకు, ప్రజానేవచేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్న తన తపన గురించి వివరించారు. నటజీవితం విరమించుకున్నారు. పూర్తికాలం ప్రజలకోసం పనిచేయాలని అనుకున్నారు. పరోక్షంగా రాజకీయాలలోకి రాబోతున్నట్లు తెలిపినా, ఎన్ని ప్రశ్నలు వేసినా, రాజకీయ రంగప్రవేశం గురించి సూటిగా మాట్లడలేదు. 1982 మార్చి 29న కొత్తపార్టీ ఏర్పాటుకు సారథ్యసంఘం ఏర్పడింది. దానికి అధ్యక్షుడు ఎన్.ట్.ఆర్. కార్యదర్శి నాదెండ్ల భాస్కరరావు. మధ్యాహ్నం 2-30 గం. లకు కార్యకర్తలు, ఇతర జనంతో కూడిన బహిరంగ సభలో ఎన్.టి.ఆర్. ఉద్విగ్నంగా మాట్లాడుతు తాను "తెలుగు దేశం పార్టీ" అనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆప్రకటనకు హర్హధ్వానాలతో జనామోదం లభించింది. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం ఆనాటి నుండి ఊపందుకుంది.

ఒక కొత్త రూపంతో, కొత్త నినాదంతో, కొత్త ఒరవడితో, ఎన్.టి.ఆర్. ఒక మహొత్తుంగ తరంగమై లేచారు. ఆయన ఆశయాలకు జనం జేజేల వర్షం కురిపించారు. వర్ణ, వర్గ వివక్షలు ఏమీ అంటని మహొద్యమం అది. ఆయన సమ్మోహన శక్తికి తోడుగా, శక్తిహీనమై పలుచబడిపోయిన కాంగ్రెస్ అశక్తత కూడా ఆయన ఉద్యమానికి బలమైన ఊపిరిపోసింది. కాంగ్రెస్ నుండి కొంతమంది ప్రముఖ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఆయన పార్టీ ఫిరాయింపులపై ఆధారపడలేదు. ఆసక్తి కూడా చూపలేదు. కొత్తరక్తం కావాలనే కోరుకొన్నారు. అభిమాన సంఘాలు రామదండుగా పనిచేశాయి. పార్టీ నిర్మాణం రాష్ట్రస్థాయి నుండి గ్రామ స్థాయికి పాకింది. 1982 ఏప్రిల్ 11వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్స్ల్ల్ల్లో లక్షలాది జనంతో చారిత్రాత్మకమైన మొట్టమొదటి మహాసభ - మహానాడు విజయవంతం అయింది. రామకృష్ణా స్టూడియో నుండి నిజాం కాలేజీ వరకు కొనసాగిన ర్యాలీ హైదరాబాద్ వీధులను దద్దరిల్లజేసింది. ఆ సభలో ఎన్.టి.ఆర్. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, వారికి ఒక గుర్తింపు, గౌరవం తేవటానికి కుళ్ళ్లిపోయిన పాత వ్యవస్థను కూకటి వేళ్ళ్లతో పెకలించి నూతన వ్యవస్థను నిర్మించడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఆయన మహొద్వేగంతో చేసిన తొలి ప్రసంగం జనాన్ని బాగా ఆకట్టుకుంది. అవినీతి, అక్రమాలకు తావులేని స్వచ్చమైన పాలన అందించడం కోసమే వచ్చానన్నారు. విజయవంతమైన ఆసభ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పార్టీ జెండా, సైకిల్ గుర్తు ఏర్పడ్డాయి.

>> మరిన్ని వివరాలు....