ఆంధ్రప్రదేశ్ లో ఐటిసి పెట్టుబడులు గుంటూరు జిల్లాలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం

Thursday, 14 May 2015 14:15

ఐటీసీ సంస్థ రూ.145 కోట్లతో గుంటూరులో నిర్మించనున్న ‘మై ఫార్చూన్‌’ ఫైవ్ స్టార్ హోటల్‌కు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. గుంటూరులో ఏర్పాటు కానున్న తొలి ఐదు నక్షత్రాల హోటల్‌ ఇదే. 1.44 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్థులు, 150 గదులతో మూడేళ్లలో హోటల్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోని మొదటి 10 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిలిపేందుకు పూర్తి సహకారం అందించాలని ఐటీసీ ప్రతినిధులను కోరారు. అమరావతిలో పెట్టుబడులు పెరిగేందుకు ప్రచారకర్తలుగా మారాలని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఐటీసీ ప్రధాన భూమిక పోషించాలని పేర్కొన్నారు.

ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌ స్పందిస్తూ గుంటూరు రైతులతో తమకు కొన్నేళ్లుగా అనుబంధం ఉందని, వారికి ఆధునిక సాంకేతికతను అందించి సుస్థిర సాగుకు సహకరిస్తామని అన్నారు. గుంటూరు జిల్లాలోని సుగంధద్రవ్యాల పార్కులో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని హామీనిచ్చారు. హోటళ్ళు, వ్యవసాయాధారిత వ్యాపారాలలో పేరుగాంచిన ఐటిసి సంస్థ ఇప్పటికే గుంటూరులో ప్రధాన కార్యాలయాన్ని కలిగివుంది.