
మద్రాసులో శోభనాచల స్టూడియోలోకి అడుగుపెట్టి, ఒక 5'-10"ల అందగాడు గంభీరంగా నడిచివస్తుంటే "ఇలాంటివాడు నా చిత్రానికి హీరో అయితే ఎంత బాగుండును" అని బి.ఎ.సుబ్బారావు మనసులో అనుకుంటుండగానే", బి.ఎ.సుబ్భారావు గారు ఎక్కడ ఉంటారని ఎన్.టి.ఆర్. అడగడం తర్వాత వారి పరస్పర పరిచయాలూ ఇవన్నీ సుబ్బారావు మనస్సుమీద చెరగని ముద్రవేశాయి. స్క్రీన్ టెస్టులూ, ఇతర పరీక్షలూ ఏమీ అవసరంలేదని త్రోసిపుచ్చి సుబ్బారావు వెంటనే వెయ్యి నూటపదహార్లు అడ్వాన్సుగా ఇచ్చి కాంట్రాక్టుపై సంతకం చేయించుకున్నాడు. అదే ఎన్.టి.ఆర్. తొలి సంపాదన, అది ఆనాడు పెద్ద మొత్తం. హొటల్ రూం అద్దె 4/- రూ.లు, భోజనం 0-50పైసలు. ఇక అటు పల్లెటూరిపిల్ల ప్రారంభం కాకముందే రామారావు ఎల్.వి.ప్రసాద్ "మనదేశం"లో సబ్ ఇన్ స్పెక్టర్ పాత్ర ధరించి మొట్టమొదటిసారి నటించారు. "కష్టపడి కానిస్టేబుల్ స్ఠాయి నుండి సబ్ ఇన్ స్పేక్టర్ స్ఠాయికి ఎదిగాను" అనే ఒకే ఒక్క డైలాగు చెప్పి లాఠీ ఝుళిపిస్తూ నిజంగానే సమరయోధుల ఎక్స్ట్ ట్రా పాత్రధారులను బాది తరిమి కొట్టారు. ఒక్క ఈ తొలి సన్నివేశంలోనేకాదు 40 ఎండ్ల సినీజీవితంలో ఇలానే ఆవేశంతో, అంకితభావంతో నటించారు. ఎన్.టి.ఆర్. సినిమా చరిత్ర నాలుగున్నర దశాబ్దాలు. 1949 లో జైత్రయాత్ర "మనదేశం"తో ప్రారంభం అయ్యింది. మధ్యలో కొంత రాజకీయ విరామం. తర్వాత 1993లో "మేజర్ చంద్రకాంత్"తో ముగిసింది. ఇందులో కేవలం సినీజీవితం 33 సంవత్సరాలు. తొలి చిత్రం "మనదేశం"లో ఎంత ఆవేశంగా నటించారో చివరి చిత్రం "మేజర్ చంద్రకాంత్"లోనూ తన 70వ ఏట అంతే ఆవేశంగా, అంతే ఉద్వేగభరితంగా నటించారు. ఈ వేషంలో ఆవేశం లేకుంటే రామారావు లేడు. హావభావాలలోనూ ప్రతి అంశంలోనూ ఆత్మవిశ్వాసం తొంగిచూస్తుంది. ఆత్మగౌరవం కోసం ప్రాణాలనైనా వదిలాడు గాని ఆత్మగౌరవాన్ని వదలలేదు. జీవితాంతం ఆయన సాగించిన 73 ఎళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో అడుగడుగునా పోరాటమే. తనకు అసమంజసమని తోచిన ప్రతి సందర్భంలోనూ ఘనమే. చివరికి మరణం కూడా పోరాటం పరిణామమే.

తెలుగు సినీ రంగంలో, రాజకీయ రంగంలోనూ, మానధనుడైన రారాజుగా చిరస్మరణీయుడయ్యారు. ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్ ల జయాపజయాలే తొలి తెలుగు సినిమా చరిత్ర. సినిమా పరిశ్రమకు గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు, తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే, సినిమారంగం ఒక పరిశ్రమగా అభివృద్దిగాంచడానికీ, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే స్ఠాయికి ఎదగడానికి ఎన్.టి.ఆర్. రాత్రింబవళ్ళు చేసిన కృషి, అతని క్రమశిక్షణ సమయపాలన ముఖ్యకారణాలు. అలుపు లేకుండా నిర్విరామంగా షూటింగ్ లలో పాల్గొని "పని రాక్షసుడు"గా పేరుపొందారు. ఆయన హీరోగా నటించిన డజన్లకొద్దీ సినిమాలు విడుదల అయిన సంవత్సరాలు అనేకం. 1964 లో 15 చిత్రాలలో నటించారు. 2-30గం ల రాత్రే లేస్తారు. కాలకృత్యాలు, యోగ, పూజ మొదలయినవి పూర్తిచేసుకుని, భోజనం చేసి సూర్యోదయానికి పూర్వమే మేకప్ వేసుకుని సిద్దంగా ఉండేవారు. స్టూడియోలో షూటింగ్ పైనే దృష్టి అంతా. మరో ద్యాస ఉండేదికాదు. కాలం విలువ చాలా బాగా తెలిసినవారు. కాలాన్ని పనిరూపంలోకి మార్చుకున్నారు. దానితో డబ్బూ, హొదా, కీర్తి సంపాదించుకున్నారు. ఆయన మొత్తం చిత్రాలు 295. వీటిలో 278 తెలుగు, 14తమిళం, 3 హిందీ. ఆయన పాత్రలలో కనిపించినంత వైవిద్యం మరో హీరోలో కనిపించదు. హీరో, విలన్, తండ్రి, కుమారుడు ఇలా అన్ని పాత్రలనూ ఏకకాలంలొ రక్తి కట్టించారు. ఆయన సినిమాలకు వసూళ్ళ్లలో అగ్రస్ఠానం. అవి రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. విజయ-వాహినీ స్టూడియోలు ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోలుగా అభివృద్ధి చెందడానికి ఆయన తొలి సినిమాలు ఎంతో దోహదంచేశాయి. అనీ జూబ్లీ సినిమాలే ఆయన తొలి పారితోషికం ఐదువేలు, చివరి దశలో పాతిక లక్షల వరకూ తీసుకున్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పట్టిందల్లా బంగారం అయింది. రాశిలోనేగాదు, వాసిలో కూడా ఆయన సినిమాలది అగ్రస్ఠానం. ఎన్.టి.ఆర్. నటించినన్ని పౌరాణిక చిత్రాలు ప్రపంచంలో మరే ఇతర నటుడూ నటించలేదు. రామునిగా, కృష్ణునిగా, వేంకటేశ్వరునిగా ఆయన పాత్రలను ప్రజలు అపరభగవంతునిగా ఆరాధించారు. ఒకే సినిమాలో నాయక, ప్రతినాయక పాత్రలు ధరించిన ఘనత కూడా ఆయనదే 43 పౌరాణికాలు, 12 చారిత్రకాలు, 55 జానపదాలు, 185 సాంఘీకాలు ఆయన చిత్రాలు. అందులో 141 శతదినోత్సవాలు లేక రజతోత్సవాలు జరుపుకున్నాయి. ఆరు సినిమాలు స్వర్ణోత్సవాలు జరుపుకున్నాయి. "లవకుశ 75 వారాలు ప్రదర్శించి రికార్డు సృష్టించింది. క్యాలెండరును తిప్పేసిన తొలి తెలుగు సినిమా"అది "నటరత్న" "పద్మశ్రీ" "విశ్వవిఖ్యాత నట సార్వభౌమ" బిరుదులు ఆయనకు లభించాయి.