నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’

Tuesday, 22 November 2016 13:40

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి. రూ.149కే కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు అందించే ఈ ‘సాంకేతిక విప్లవం’ సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా అందుబాటులోకి వస్తుంది. దీనికి అవసరమైన రుణం, ఇతర ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం ఎపి ఫైబర్ బ్యాంకుల నుంచి రూ.300కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి రూ.100కోట్లు... వెరసి రూ.400కోట్ల రుణం తీసుకుంటుంది. ఈ డబ్బుతో టీవీ ప్రసారాలు, వైఫై, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవల కోసం పది లక్షల ఐపీటీవీ, జీపాన్‌ బాక్సులు కొనుగోలు చేస్తారు. వీటి ద్వారా పది లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తారు. బహిరంగ మార్కెట్లో జీపాన్‌ బాక్సు ఒక్కటే రూ.14,500 ఉంటుంది.

ఫైబర్‌ గ్రిడ్‌ కింద రెండు బాక్సులనూ సాఫ్ట్‌వేర్‌తో కలసి రూ.4వేలకే అందచేస్తారు. ఒకేసారి రూ.4 వేలు చెల్లించే వినియోగదారులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. అంత చెల్లించలేని వాళ్లు... తొలుత రూ.1700 చెల్లించి, మిగిలింది నెలకు రూ.99 చొప్పున మూడేళ్లపాటు విడతల వారీగా చెల్లించవచ్చు. అదేవిధంగా రూ.500 చెల్లించి... నెలకు రూ.99 చొప్పున నాలుగేళ్లపాటు సులభవాయిదాల్లోనూ చెల్లించే వీలుంది. దక్షిణ కొరియా, చైనా నుంచి ఈ బాక్సులు వచ్చేందుకు కనీసం 7 వారాలు పడుతుంది. అందువల్ల, రాష్ట్రంలో టీవీ ప్రసారాలు, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించాలని పైబర్‌ గ్రిడ్‌ అధికారులు భావిస్తున్నారు.

నెలకి రూ.149కి ఉచిత టెలిఫోన్‌, 10ఎంబీపీఎస్‌ వేగంతో కూడిన ఇంటర్‌నెట్‌, ఉచిత ఛానళ్లతో కూడిన కేబుల్‌ టీవీ ఇవ్వాలని ఏపీ ఫైబర్‌ తొలుత ప్రతిపాదించింది. తాజాగా ఇందులో మార్పు చేసి సాధారణ వినియోగదారునికి అవసరమయ్యే పే ఛానళ్లను సైతం నెలకి రూ.149 రుసుంతోనే ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగులోని చాలా వరకు పే ఛానళ్లతోపాటు కొన్ని హిందీ, ఇంగ్లీష్‌ పే ఛానళ్లు, క్రీడలకు సంబంధించిన మరికొన్ని పే ఛానళ్లు ఇందులో ఉండనున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన ఛానళ్ల యాజమాన్యాలతో ఒప్పందాలు సైతం పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల చేస్తున్న ప్రసారాల్లో 220 ఛానళ్ల వరకు వస్తున్నాయి. వీటిల్లో వివిధ భాషలు, విభాగాలకు చెందిన పే ఛానళ్లు ఉన్నాయి.

ప్రముఖ పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక

ఇటీవలి పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక